హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని ఆరోపించారు.
పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు లోకేష్. గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో వైసీపీ ఫ్యాక్షన్ మూకలు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చేశారన్నారు.
చంద్రయ్య హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు లోకేష్. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు లోకేష్. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.