ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి ఏం సమాధానం చెప్తారో వినాలని ఉందన్నారు లోకేష్. ఓ సామాన్య దళిత మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు.. కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరించారని మండిపడ్డారు.
వెంకాయమ్మకి గానీ.. ఆమె కుటుంబసభ్యులకి గానీ.. ఎటువంటి హాని తలపెట్టినా ఈ ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ లో ఉన్న ఫ్యాక్షన్ భూతం నిద్ర లేచిందని ఆరోపించారు లోకేష్. జగన్ చూసి ఏపీ జనం బయపడి పారిపోతున్నారని విరుచుకుపడ్డారు.
సీఎం జగన్ కు, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుందన్నారు. దిక్కు తోచని స్థితిలో ఏం చేస్తున్నారో అర్ధం కాకుండా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేస్తున్న అరాచకాలన్నింటినీ ఏపీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్ మాటలు బూటకం.. చేతలు నాటకం అని ఏపీ ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై కుదిరితే కేసులు.. లేకుంటే దాడులు అన్నట్టు జగన్ ప్రవర్తనా శైలి ఉందన్నారు లోకేష్. జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తోన్నందుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కారు ధ్వంసం చేసి.. తనను చంపేస్తామని బెదిరించడం దారణమైన చర్య అని విరుచుకుపడ్డారు లోకేష్.