మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సవాల్ విసిరారు. జగన్ కానీ.. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ గానీ వివేకాను హత్య చేయలేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా అని ఆయన చాలెంజ్ చేశారు.
“ఈ నెల 14న జగన్ తిరుపతికి వస్తున్నారట.. జగన్ బాబాయిని నేను కానీ.. నా కుటుంబ సభ్యులు కానీ హత్య చేయలేదని అదే రోజు వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి అందుకు సీఎం జగన్ అందుకు సిద్ధంగా ఉన్నారా” అని నారా లోకేష్ ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిచెందడంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీడీపీ తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. వైసీపీ తరపున గురుమూర్తి పోటీ చేస్తుండగా.. బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.