నారా చంద్రబాబునాయుడుకు, ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’కు వున్న సంబంధం ఈనాటిది కాదు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ వెళ్లినా వెళ్లకపోయినా చంద్రబాబునాయుడు మాత్రం తప్పకుండా వెళతారు. అధికారంలో వున్నా, లేకపోయినా ఆయనకు ఆహ్వానం వస్తూనే వుంది. ఆయన వెళ్తూనే వుంటారు. సాధారణంగా దావోస్‌లో జరిగే అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సుల ద్వారా తాను ఎంతో నేర్చుకుంటూ వుంటానని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు వారసుడిగా లోకేశ్ డబ్లూఈఎఫ్ సదస్సులకు వెళ్తున్నాడు. పవర్‌లో వున్నా, లేకపోయినా చంద్రబాబు ముద్ర ఏంటో ఈ సదస్సులో లోకేశ్ స్పీచ్‌కు వచ్చిన రెస్పాన్స్ బట్టి చెప్పచ్చు..
ఢిల్లీ: వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్ సమావేశంలో యంగ్ గ్లోబల్ లీడర్ హోదాలో నారా లోకేష్ పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆధునికత, సాంకేతికతలను జోడించి గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరాతో సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అప్పట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నారా లోకేష్‌ని యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించింది. గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలు’ తదితర అంశాలపై ఈ సమ్మిట్‌లో చర్చా గోష్ఠులను నిర్వహించారు. ‘ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు డేటా వినియోగం’ అనే అంశంపై జరిగిన చర్చలో లోకేష్ పాల్గొన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.
ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్య నగరాల్లోని పారిశుధ్య నిర్వహణ. దీనిపై జరిగిన చర్చలో కూడా లోకేష్ పాల్గొన్నారు. దేశంలోని నగరాల్లో మెరుగైన పారిశుధ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో పారిశుధ్య నిర్వహణకు అనుసరిస్తున్న విధానాల గురించి లోకేశ్ ప్రస్తావించారు.