టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యువ గళం పాదయాత్ర నిర్వహణపై చర్చించారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి జాతీయ ప్రధాన కార్యదర్శి యువ గళం పాదయాత్ర ప్రారంభిస్తున్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పార్టీ యంత్రాంగం మొత్తం యువ గళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధిలోకి రావాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.
అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. మూడున్నర ఏళ్లుగా మనం ఒక సైకోపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదన్నారు. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు. అయినా మీరు ఎక్కడా తగ్గలేదన్నారు. టీడీపీకి బలం కార్యకర్తలు, నాయకులే అని లోకేష్ ఉద్ఘాటించారు. మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిని అలా చేసుంటే వైసీపీ ఉండేది కాదన్నారు.
కానీ మా వాళ్లు అలా కాదు.. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో అని తొడకొట్టారన్నారు. పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే బ్యాచ్ అని.. ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చారన్నారు. 151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చేయొచ్చన్నారు. కానీ జగన్ కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారన్నారు. ఏ వర్గం సంతోషంగా లేరని.. జగన్‌పై ప్రజల్లో ద్వేషం కనిపిస్తుందన్నారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగస్తులు ఆఖరికి పోలీసులు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు.
లిక్కర్, సాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారు. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. వార్ ఒన్ సైడ్ అయిపొయింది.. ప్రజలంతా టీడీపీ వైపు ఉన్నారన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుందన్నారు. దీని కోసం అందరం కలిసి ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఇప్పటికే బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లామన్నారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర నా పాదయాత్ర సాగుతుందని.. ‘మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలి’ అన్నారు. ‘మన దేవుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను, మన రాముడు చంద్రబాబు గారి విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుంది’ అని స్పష్టం చేశారు నారా లోకేష్.