నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
రెండు దశల్లో కోవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలు మళ్లీ ప్రారంభించిన రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై బలవన్మరణం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుగానే అర్ధవంతమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు.
ఏపీలో దాదాపు 12,000 కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మార్చి 2020లో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది టీచర్లకు సక్రమంగా జీతాలు లేవు. గత 5 నెలల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు భరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. ఆకలి, అప్పుల సమస్య విద్యారంగాన్ని ఎంతో బాధిస్తుండటం కలచివేస్తోంది.
బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారటం వంటి విషాద గాధలు ఎన్నో మీడియాలో చూస్తున్నాం. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల అనేక మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయ సంస్కృతి, సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన మీరు.. ప్రైవేట్ విద్యా రంగంలో పనిచేసే సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు తోచిన సాయం అందించాయి. తెంలంగాణ ప్రభుత్వం నెలకి 2 వేల రూపాయిల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందించింది. కర్నాటక సర్కార్ నెలకి 5 వేల రూపాయిలను ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా వారి జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి.