నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
గతేడాది ఆగస్టు 26న గ్రామ పంచాయతీ లేఅవుట్ల(కొత్తవి)లోని ప్లాట్లను రిజిస్టర్ చేయొద్దని 141 సబ్ రిజిస్ట్రార్లకు మెమో జారీ అయింది. దీని కారణంగా పట్టాదారులు, రియల్టర్లు, కొనుగోలు దారులు రిజిస్ట్రేషన్లు కాక ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నారు. 30 ఫీట్ల రోడ్ల మొత్తం స్థలంలో 10శాతం పార్కింగ్ స్థలం ఉండాలని కఠిన నిబంధనలు పెట్టాలి గానీ.. గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ అనుమతి ఇచ్చిన లేఅవుట్లు ఇల్లీగల్ అని చెప్పడం సమంజసం కాదు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలోని ప్లాట్లు పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండవు.
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో కల్పించిన మౌలిక వసతులు అక్కడ ఇండ్ల నిర్మాణాలు వచ్చే నాటికి ఉండవు. కావున వాటి వలన ఉపయోగం ఎవరికి. ఇల్లీగల్ పనులు చేస్తోంది ప్రభుత్వం. సీఎస్ సోమేష్ కుమార్ నియామకం ఇల్లీగల్. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఇల్లీగల్. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను అనుమతించాలి.
సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునకు అనుకూలంగానే తీర్పు ఇస్తుందని భావిస్తున్నాం. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారికి కూడా ప్రబుత్వం ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదు. ఆ లేఅవుట్లు కోర్టు కేసులలో పడితే బాధితులకు సహాయం చేస్తుందా? ప్లాట్లు ఇస్తుందా? ప్రభుత్వ భూమికి వక్ఫ్ బోర్డు భూమికి హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లలో కొన్నవారు ప్రస్తుతం అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు కావడం లేదు.
ఎల్‌ఆర్‌ఎస్ తో ఇంటి పర్మిషన్ తీసుకొని కట్టిన వాటికి కూడా వక్ఫ్ బోర్డ్ భూమి అని రిజిస్ట్రేషన్ కావడం లేదు. లోపం ప్రభుత్వానిది.. అధికారులది. అమాయక ప్రజలు బాధితులు. తన తప్పు సరి చేసుకోలేని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ఆపి ప్రజలను పీడించడం సమంజసం కాదు. ఈ విషయంలో ప్రభుత్వంతో గానీ అధికారులతో గానీ చర్చకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సిద్ధం. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ధరణి విషయంలో గానీ ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో గానీ గ్రామ పంచాయతీ లేఅవుట్ల విషయంలో గానీ తెలంగాణ రియల్టర్స్ వాదనే కరక్ట్ అని పదే పదే రుజువు అవుతోంది.