ధరణి దెయ్యం రైతులను ఇంకా వదలనే లేదు.. ధరల భూతం పేద, మధ్య తరగతి వారిని వెంటాడుతూనే ఉంది.. ఈ తరుణంలో మరోసారి భూముల మార్కెట్ విలువ పెంచడం సుపరిపాలకుడి లక్షణం కాదన్నారు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ కుమార్. రిజిస్ట్రేషన్ చార్జీలు పేద మధ్య తరగతి వారికి మోయలేని భారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితమే మార్కెట్ విలువను 30 శాతం నుండి 50 శాతం పెంచడమే కాక స్టాంపు డ్యూటీనీ 6 శాతం ఉన్న దాన్ని 7.5 శాతానికి పెంచిందని గుర్తు చేశారు నారగొని. దీనివల్ల రూ.2 లక్షలలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్ కు రూ.4 లక్షలు పెట్టాల్సి వస్తోందని వివరించారు. అంతే కాకుండా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కు పోతే మార్కెట్ విలువపై 14శాతం ఎల్ఆర్ఎస్ చార్జ్ చేస్తున్నారని.. పాత రేటు ప్రకారం రూ.3 లక్షలు అయితే అది ప్రస్తుతం రూ.4.5 లక్షల అవుతోందన్నారు. రిజిస్ట్రేషన్, ఎల్ఆర్ఎస్ చార్జ్ కలిపితే ఊరి బయట మరో ప్లాట్ కొనుక్కోవచ్చని చెప్పారు.
ఇప్పుడు మళ్ళీ మార్కెట్ విలువ పెంచితే పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల అందని ద్రాక్షగా మిగిలిపోతుందన్నారు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం ఉద్యోగి హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కొలేడని.. తనకు వస్తున్న జీతంతో ఇల్లు గడపడానికి, పిల్లల చదువులకు పోను మిగిలేది అంతంత మాత్రమేనని తెలిపారు. ముంబై నగరంలోనైనా ఇల్లు కొనుక్కోవచ్చు కాని.. హైదరాబాద్ లో కట్టుకోవడం చాలా కష్టమైపోయిందన్నారు.
నగర శివారు గ్రామాలలో కూడా 133 గజాలలో ఇల్లు రూ.85 లక్షలు పలుకుతోందన్న నారగొని… అపార్ట్ మెంట్ లో ప్లాట్ రూ.60 లక్షల నుండి రూ.1.5 కోట్లు అవుతోందని తెలిపారు. ముంబై నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో రూ.20 లక్షలకు ఎకరం భూమి దొరుకుతుంది కాని.. హైదరాబాద్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో కూడా రూ.20 లక్షలలో ఎకరం భూమి దొరకదన్నారు. ఇప్పటికే తెలంగాణలో దున్నే వాడి చేతిలో భూమి లేకుండా అయిందన్న ఆయన.. అంతా సంపన్నుల దొరల చేతిలో బందీ అయిందని ఆరోపించారు.
పంట పండించేవాడు ఎలాంటి హక్కులు లేని కౌలు రైతు అయిపోయాడని.. వ్యవసాయం మీద కుటుంబాన్ని పోషించుకునే రైతు ఒక ఎకర భూమి కొనుక్కోలేని పరిస్థితి దాపురించిందన్నారు నారగొని. మార్కెట్ విలువ పెంచితే భూముల ధరలకు రెక్క లొస్తాయి.. విలువ పెంచడం వలన రిజిస్ట్రేషన్ చార్జ్ మాత్రమే కాకుండా, ఎల్ఆర్ఎస్ చార్జ్ కూడా భారం అవుతుంది.. కావున తెలంగాణ ప్రభుత్వం వెంటనే ధరల పెంపుదలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్.