నారగొని ప్రవీణ్ కుమార్, సామాజిక కార్యకర్త
రాష్ట్రం ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ.. గంజాయి, డ్రగ్స్ గల్లీల్లో యువతకు అందుబాటులో ఉంటుంటే అరికట్టలేక పరోక్షంగా గజానికో గాంధారి పుత్రుడ్ని, కిలోమీటర్ కో కీచకుడ్ని తయారు చేస్తోంది. తెలంగాణలో ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సింది నేరం జరిగిన తరువాత కాదు. అసలు నేరమే జరగకుండా చూడాలి.
మద్యం ద్వారా వీలైనంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వేలాది వైన్ షాపులు, బార్లకు లైసెన్సులు ఇవ్వడం వలన యువత మద్యానికి బానిసలై నేరాలకు పాల్పడుతున్నారు. సైదాబాద్ బాలిక చివరి బాధితురాలు కావాలి.. రాజు చివరి నేరస్థుడు కావాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఈ రెండు మరణాలకు కారణం ప్రభుత్వమే. ముమ్మాటికీ సర్కార్ అమ్మిన మద్యమే. రాజుతో పసిపాప మాన, ప్రాణాన్ని బలి తీసుకుంది. అతడ్ని చరిత్ర హీనుడిని చేసింది మద్యమే. తాగనప్పుడు తన భర్త బాగా చూసుకునేవాడని రాజు భార్య చెబుతోంది. తాగినప్పుడు మాత్రమే కొట్టేవాడని స్టేట్ మెంట్ ఇచ్చింది.
తెలంగాణలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని అనిపిస్తోంది. ధృతరాష్ట్రుడు తన కుమారుడిని రాజుని చేయడానికి మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణం అయ్యాడు. లక్షలాది మరణాలకు సాక్ష్యం అయ్యాడు. మన రాష్ట్రంలో కూడా యువరాజుని రాజును చేయడానికి వెచ్చించే కాలంలో 10శాతం అయినా ప్రజాక్షేమంపై మన ప్రభువు దృష్టి పెడితే ఇలాంటి దారుణాలు జరగవు. డ్రగ్స్ కు బానిసలైన నటులను ఏదో దేశాన్ని ఉద్ధరించిన వారిగా మీడియా చూపిస్తోంది. వారిలో కొందరు డ్రగ్స్ కు బానిసలు కాకపోవచ్చు. అనుమానితులే అవ్వొచ్చు. విచారణ త్వరగా ముగించి నేరస్థులను గుర్తించి కఠినంగా శిక్షించాలి.