తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారు. అనుకున్నదే తడవుగా ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో అధికార పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న నరసన్నపేటలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దందా నడుస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల నుంచి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.
కేసీఆర్ దత్తత తీసుకున్న సమయంలో నరసన్న పేటకు మొదటి విడతలో 200 ఇళ్లను మంజూరు చేశారు. వాటిలో 196 ఇళ్లు కంప్లీట్ అయ్యాయి. అలాగే రెండో విడతలో మరో 25 ఇళ్లు, మూడో విడతలో 40 ఇళ్లను మంజూరు చేశారు. అయితే వీటిలో మొదటి విడతలోని 196 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. రెండో విడత, మూడో విడతలో మంజూరు చేసిన ఇళ్లను పేదలకు ఇచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు డబ్బులను డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు లబ్ధిదారులు.
ఇందుకు నిరసనగా బాధితులు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే వీటిపై స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరో వారం రోజుల్లో ఈ సమ్యకు పరిష్కారం లభించకపోతే కలెక్టరేట్ కార్యాలయాన్ని పెద్దఎత్తున ముట్టడిస్తామన్నారు. న్యాయం జరిగేంత వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు డబ్బులు డిమాండ్ చేశారని, అందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు మా వద్ద ఉన్నాయన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.