గుంటూరు జిల్లా రొంపిచర్లలో టీడీపీ నేత వెన్నా బాలకోటి రెడ్డిపై కాల్పులకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఖండించారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెన్నా బాలకోటి రెడ్డిపై తుపాకీ కాల్పులు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయవద్దని అన్నారు. టీడీపీ నేతల మధ్య అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరే హత్యాయత్నానికి కారణమని అన్నారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన వెంకటేశ్వరరెడ్డి తెలుగు దేశం పార్టీలోనే ఉన్నారని అన్నారు.
దాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ నేతలకు సవాలు చేశారు. అవసరమైతే తన కాల్ డేటా తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఎవరు ఎవరితో మాట్లాడారో కనిపెట్టాలని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు తాను చెప్పినట్లుగా చెప్పారు.
‘‘కాల్ డేటా తీద్దాం. ఎవరు ఎవరితో మాట్లాడారో తెలిసిపోతుంది. తుపాకీ సరఫరా చేసిన వ్యక్తిని, దాడి చేసిన వ్యక్తులు అందరిని పోలీసులు అరెస్టు చేశారు. గన్ కల్చర్ రావటం దురదృష్టకరమని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారందరిని అరెస్టు చేయమని పోలీసులకు చెప్పాను. నేను ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధం’’ అని గోపిరెడ్డి స్పష్టం చేశారు.