మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. టెన్త్ పరీక్షల పేపర్ లీకేజీకి సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాలను నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వాట్సాప్ లో షేర్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చిత్తూరు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఏప్రిల్ 4న నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు.
నారాయణ సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటా సేకరించిన పోలీసులు.. ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవహారాన్ని నడిపారన్నదానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది అన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెలుగుచూశాయని సమాచారం.
హైదరాబాద్ లోని కొండాపూర్ లో నారాయణను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. కొద్దిరోజులుగా పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. తొలి పరీక్షతో మొదలుపెట్టి వరుసగా పేపర్లు లీక్ అయ్యాయి.
ఒకానొక దశలో ప్రభుత్వం పెట్టిన పాస్ టార్గెట్లతోనే టీచర్లు అక్రమాలకు దిగారన్న వాదన కూడా వినిపించింది. అయితే.. అవన్నీ తప్పని విద్యామంత్రి బొత్స ప్రకటన కూడా చేశారు. పేపర్ లీకేజ్ కాలేదని ప్రకటించారు. కానీ.. మొన్నామధ్య తిరుపతి సభలో ఏపీ సీఎం జగన్ మాత్రం పేపర్ లీకేజీ జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేశారు. మంత్రి లీక్ కాలేదని ప్రకటిస్తే.. నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.