రెండున్నర ఎకరాల సాగు కోసం ఆ రైతు అపరభగీరథుడయ్యాడు. బీడు భూమిని పచ్చగా మార్చేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. ఒకటి కాదు రెండు కాదు ఆ భూమిలో పది బోర్లు వేసాడు. కానీ నీరు రాలేదు. అయినా రైతులో ఆశ చావలేదు. పదకొండోసారి ప్రయత్నించాడు. ఈసారి గంగమ్మ కరుణించింది. కానీ బోర్లు కోసం చేసిన అప్పులు మాత్రం కుప్పలుగా పేరుకుపోయాయి.
సీన్ కట్ చేస్తే..నీళ్లున్నాయి కానీ సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. కొత్తగా అప్పు ఇచ్చేవారే లేకపోయారు. ట్రాక్టర్‌తో పొలం దన్నించేందుకు కూడా రూపాయి లేని పరిస్థితి ఎదురైంది. దీంతో ఆ రైతు తన ఇద్దరు కొడుకులనే కాడెద్దులుగా మార్చుకున్నాడు. తండ్రి గొర్రు పట్టుకొంటే.. కొడుకులు లాగి పొలాన్ని సాగు చేశారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లి గ్రామానికి చెందిన పెద్దరాములకు ఎదురైన పరిస్థితి ఇది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో.. పెద్దరాములు కష్టం బయటి ప్రపంచానికి తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన్ను అడిగితే.. బోర్లు వేసిన అప్పులు తీరాలి అంటే.. మరి కొన్నేళ్లు ఈ కష్టాలు తప్పవని అంటున్నాడు.