ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్య కారుడు పండిట్ శివకుమార్ శర్మ కన్ను మూశారు. గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ముంబైలో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు.
పండిట్ శివ కుమార్ మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శివకుమార్ మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. సంతూర్ వాయిద్యానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపును ఆయన తీసుకు వచ్చారని మోడీ అన్నారు.
ఆయన సంగీతం రాబోయే తరాలను ఉర్రూతలూగిస్తూనే ఉంటుందన్నారు. ఆయనను కలిసినప్పటి క్షణాలను తాను గుర్తు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పండిట్ శివ కుమార్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన మరణం మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు ఆని ఆమె పేర్కొన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకుని తాను తీవ్రంగా బాధపడినట్టు ఆమె ట్వీట్ చేశారు.