బాబుకి మోదీ ఝలక్ (ఇదీ కూడా పాయే..)

మీ యాక్షన్ మీరు చేస్తే మా యాక్షన్ ఇదిగో చూడండి అన్నట్టుంది కేంద్రం యవ్వారం. తమ ఇద్దరు కేంద్రమంత్రుల చేతా రాజీనామా చేయించి రేపోమాపో ఎన్టీయే నుంచీ బైబై చెప్పేయ్యాలని చూస్తున్న చంద్రబాబుకి పెద్ద షాకే ఇచ్చింది మోదీ నేతృత్వంలోని కేంద్రం. కొంతకాలంపాటు ఏపీ కి ప్రత్యేకహోదా ఇస్తామని ఊరించి తర్వాత స్పెషల్ ప్యాకేజీ అంటూ ప్లేటు ఫిరాయించిన మోదీ సర్కారు.. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ అదే చేసింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్‌ ఆశలపై పూర్తిస్థాయిలో నీళ్లు చల్లేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ దినేశ్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చి చెప్పారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌కు లైన్‌ క్లియర్‌ అయిందని, ఒడిశాతోనూ చర్చలు జరిపామని, తప్పకుండా రైల్వేజోన్‌ ఇస్తామని ఇటీవల ప్రకటన చేసిన కేంద్రం ప్లేటు పూర్తిగా ఫిరాయించింది. రైల్వేజోన్‌ సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా ఉన్నాయని, రైల్వే బోర్డు కూడా వ్యతిరేకంగా ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ ప్రజల్ని రైల్వే జోన్ విషయంలోనూ నయవంచనకు గురిచేసినట్లైంది నరేంద్రమోదీ సర్కారు.