తను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ముందుగా అమ్మ కళ్లల్లోకి చూస్తానంటున్నాడు నరేష్. అప్పుడు తనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందని, ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా తను అనుకున్నది చేసేస్తానని అంటున్నాడు. అమ్మే తనను నడిపిస్తోందని చెప్పాడు.
“నాకు నచ్చింది నేను చేస్తాను. మా అమ్మ గుడికి వెళ్ళి అమ్మ కళ్ళలో చూస్తాను. నాకు ఆలోచన వస్తుంది. అదే చేస్తాను. రాజకీయాల్లోకి వెళ్ళాను. సేవా కార్యక్రమాలు చేశాను. ఒక సిద్ధాంతంతో బీజేపీలో పనిచేశాను. అయినా తృప్తి లేదు. మరలా కళామతల్లి వైపు వచ్చాను. నన్ను మెచ్చిన దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. నేను రోజూ వ్యాయామం చేస్తాను. మైండ్ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే లైఫ్” ఇలా తన లైఫ్ ఫిలాసఫీని బయటపెట్టాడు నరేష్.
మళ్లీ పెళ్లి సినిమా కథ తనది కాదంటున్నాడు ఈ సీనియర్ నటుడు. డర్టీ హరి సినిమా నుంచి ఎంఎస్ రాజుతో జర్నీ చేస్తున్నానని, కొంత కాలం గడిచిన తర్వాత స్వయంగా ఆయనే ఈ కథ వినిపించారని చెప్పుకొచ్చాడు.
సినిమా చూసిన తర్వాత అందులో తన నిజజీవితం ఎంత ఉందో, ఎంఎస్ రాజు క్రియేషన్ ఎంత ఉందో ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని అంటున్నాడు నరేష్. ఈ సినిమాను అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా విడుదల చేస్తున్నామని, రిలీజైన తర్వాత ఇది ఆటంబాంబ్ లా పేలుతుందని చెబుతున్నాడు.