నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
రాష్ట్రంలోని పబ్ లు, బార్లు, వైన్స్ లపై తిరుగుబాటు చేయడానికి మహిళలు కాళికామాతలై కదిలి రావాలి. చీపురు కట్టలు పట్టుకొని తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు తిరుగుబాటు చేస్తేనే రాష్ట్రంలో మద్యం మచ్చుకులేకుండా పోతోంది. మన రాష్ట్రంలో రేప్ ల సంఖ్య పెరిగిపోయింది. దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉంది. తాగి తాగి చిన్న వయసులోనే యువకులు మరణిస్తున్నారు. దీంతో నిండా ముప్పై ఏళ్లు నిండక ముందే ఆడపిల్లలు భర్తలను కోల్పోతున్నారు.
రాష్ట్రంలో జరిగే అనేక నేరాలకు అధికంగా తాగుడే కారణమవుతోంది. ప్రజలను మత్తులో ముంచి.. పాలకులు ప్యాలెస్ లలో కులుకుతున్నారు. రాష్ట్ర సంపద గంపగుత్తగా పాలకుల ఇళ్లలో చేరింది. తిండికి లేనోడు.. ఎమ్మెల్యే అయి, మంత్రి అయి వందల ఎకరాల ఆస్తులు పెంచుకున్నాడు. కోట్ల విలువ చేసే క్వారీలు ఎక్కడ నుండి వచ్చాయి. ప్రజాధనాన్ని లూటీ చేసి సంపాదించినవి కాదా..?
మద్యానికి బానిసలైన యువకుల అనారోగ్యం పాలైతే.. ట్రీట్ మెంట్ చేసుకునే కార్పోరేట్ ఆసుపత్రులు కూడా రాజకీయ నాయకులవే అయ్యాయి. పేదలు ఆస్తులు అమ్మి పెట్టినా సరిపోనంత బిల్లులు వేస్తూ.. ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మన పిల్లలను చదివించాలి అంటే ప్రభుత్వ స్కూల్స్ లో సదుపాయాలు ఉండవు.
తినీ, తినక కడుపు మాడ్చుకొని సంపాదించిన సొమ్మును పిల్లల చదువుల కోసం ప్రైవేట్ స్కూల్స్ కు కాలేజీలకు పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా వారివే కదా..? పది శాతం పీజులు పెంచుకొమ్మని రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు తీపి కబురు చెప్పి.. పేదల కండ్లల్లో కారం కొట్టింది. పేదల బతుకులు మారకున్నా.. పెద్దల సంస్థలు కళకళలాడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం. మహిళా లోకం కదిలి రావాలి. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి. అప్పుడే మనం కోరుకున్న బంగారు తెలంగాణ సిద్ధిస్తోంది.