ఇంటర్నేషనల్ మాదకద్రవ్యాల స్మగ్లర్ ఎడ్విన్ కేసులో హైదరాబాద్ పోలీసులు స్పీడు పెంచారు. ఈ కేసులో భాగంగా నార్కోటిక్ పోలీసులు తాజాగా మాదక ద్రవ్యాలను సప్లై చేసే మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లో న్యూఇయర్ టార్గెట్ గా మాదకద్రవ్యాలు సరఫరా చేసిన మోహిత్ ను నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ నేహాదేశ్ పాడే భర్త. మరో వ్యక్తి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కృష్ణ కిషోర్ రెడ్డి.
ముంబైకి చెందిన మోహిత్ పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటు సినీ ప్రముఖులకు కూడా కొకైన్ సరఫరా చేస్తూంటాడు. మైరాన్ మోహిత్ 12 ఏళ్ల నుంచి మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా ఉన్నాడు మైరన్. భారత్ తో పాటు వివిధ దేశాల్లో డీజే ఏర్పాటు చేయడంలో దిట్టగా అతనికిపేరు ఉంది. డీజే మాటున మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూంటాడు. గోవా మాదక ద్రవ్యాల కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో మైరాన్ కు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
50 మందికి పైగా మాదక ద్రవ్యాల పెడ్లర్స్ తో అతనికి సంబంధాలున్నాయి. సన్ బర్న్ పార్టీలకు కూడా వీటిని సరఫరా చేస్తూంటాడు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు వ్యాపారవేత్తలతో అతినికి లింకులు ఉన్నాయి. ప్రస్తుతం అతని కాంటాక్ట్ లిస్ట్ ని వెతికి తీస్తున్నారు పోలీసులు. మైరాన్ తో పాటు కృష్ణ కిషోర్ ని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. గత కొంత కాలంగా మైరాన్ తో కృష్ణ కుమార్ పరిచయాలు పెంచుకున్నాడు. సుపర్ లగ్జరీ బస్సులో పార్సెల్ రూపంలో మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి.
కాగా కేఎంసి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి. హైదరాబాద్ ప్రముఖ బిల్లర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కృష్ణ కిషోర్ రెడ్డి కార్యకలాపాలపై పోలీసులు నిఘా వేశారు. తెలంగాణ, ఏపీలో కాంట్రాక్టులు నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డిపై నిఘా పెంచారు పోలీసులు.