మావోయిస్టు మహిళ నేత పోలీసుల ఎదుట లొంగి పోయినట్టు తెలుస్తోంది. మావోయిస్టు మహిళా నేత ఆలూరి ఉషా రాణి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. తెనాలికి చెందిన ఉషా రాణి అలియాస్ నర్మదక్క ప్రస్తుతం దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు.
ఉషా రాణి ఏపీలోని గుంటూరు జిల్లా గుర్వాడలో జన్మించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు మావోయిస్టు, నక్సలైట్ దళాల్లో పలు ర్యాంకుల్లో పని చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త కిరణ్ కుమార్ లపై రూ. 20లక్ష రివార్డులు ఉన్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డి మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల నర్మదక్క క్యాన్సర్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కీమో థెరపీ చేయించుకున్నారని, దీంతో ఆమె చాలా బలహీనంగా తయారయ్యారని నడవలేని స్థితికి వచ్చారని తెలుస్తోంది. దీంతో 2018లో అనారోగ్య కారణాల వల్ల దళాన్ని వీడి ఓ ప్రాంతంలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో నర్మదక్కతో పాటు ఆమె భర్తను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత వారిద్దరిని తెలంగాణ పోలీసులు ప్రశ్నించి పలు కీలక విషయాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత వారిని గడ్చిరోలి పోలీసులకు వారిని తెలంగాణ పోలీసులు అప్పగించినట్టు సమాచారం. కానీ ఈ విషయంపై గడ్చి రోలి పోలీసులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. దీనిపై గడ్చిరోలి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.