తన చిరకాల కోరిక నేరవేరినా… మళ్లీ పార్టీ మారేందుకు రాజుగారు సిద్ధమయ్యారా…? అంటే అవుననే అంటున్నారు స్థానిక వైసీపీ శ్రేణులు. రాష్ట్రంలో పార్టీలన్నీ మారి చివరకు తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిన స్థితిలో వైసీపీలో చేరి, ఎంపీగా గెలిచారు. అయినా ఇప్పుడు పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీ గూటికి చేరబోతున్నట్లు ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోన్న నేపథ్యంలో… వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదని ఎంపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలోకి వెళ్లేందుకు సగం మంది వైసీపీ ఎంపీలు రెడీగా ఉన్నారన్న వార్తలతో అయోమయంలో ఉన్న వైసీపీకి, ఇప్పుడు నరసాపురం ఎంపీ పార్టీ మారబోతున్నట్లు పేర్లు కూడా బయటకు వస్తుండటంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఓడిపోయే స్థానంలో నేను గెలిచి, పార్టీని గెలిపించాను… స్వయంగా మెగాస్టార్ ఫ్యామిలోని వ్యక్తి నాగబాబును ఓడించాను. అయినా నాకు సరైన ప్రాధాన్యత లేదని ఎంపీ, ఆయన వర్గం అసంతృప్తితో ఉందని కొంతకాలంగా చర్చ నడుస్తోంది. పైగా ఢిల్లీలోనూ స్వేచ్ఛగా ఓ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలన్నా… అనుమతేంటని వారు ప్రశ్నిస్తున్నట్లు ఊహగానాలు వినపడుతోన్నాయి.
ఇదే నిజమైతే కనుక… వైసీపీ నుండి మరిన్ని వలసలు ఊపందుకునేలా కనపడుతోన్నాయి. ఓ వైపు టీడీపీని ఖాళీ చేసే పనిలో వైసీపీ ఉంటే, వైసీపీని ఖతం చేసే పనిలో బీజేపీ ఉందని… తద్వారా బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.