అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘డైమార్ఫస్’ గ్రహ శకలాన్ని ఢీ కొని కక్ష్యలో దిశ మార్చుకుందని ఈ సంస్థ నిపుణులు తెలిపారు. తమ మిషన్ సక్సెస్ అయిందని, గ్రహశకలం భూమిని ఢీ కొనే ప్రమాదం నుంచి రక్షించగలిగామని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. డార్ట్ అనే స్పేస్ క్రాఫ్ట్ గత నెల చివరివారంలో ఈ గ్రహశకలాన్ని ఢీకొంది. ఫలితంగా దీని కదలికకు సంబంధించిన ట్రాజెక్టరీ (మార్గం) ని మార్చగలిగామని నెల్సన్ తెలిపారు.
ఈ భూగ్రహాన్ని పరిరక్షించడంలో మేం శ్రద్ధ చూపుతున్నామనడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. రెఫ్రిజిరేటర్ సైజులో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ గత నెల 26 న గంటకు 14 వేల మైళ్ళ దూరంలో ప్రయాణిస్తూ డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీ కొన్నట్టు ఆయన చెప్పారు.
ఓ ఫుట్ బాల్ స్టేడియం అంత ఉన్న గ్రహశకలం ..డైడిమోస్ అనే మరింత పెద్దదైన గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోందని ఆయన వివరించారు.
డైమార్ఫస్ భూమికి ప్రమాదకరం కాకపోయినప్పటికీ.. దీని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. యేస్ట్రోనమీ అబ్జర్వేషన్ ప్రకారం కక్ష్య 11 గంటల 23 నిముషాల మార్పును సంతరించుకుందన్నారు. అంతకు ముందు డైమార్ఫస్ .. ప్రతి 11 గంటల 55 నిముషాలకు డైడిమోస్ గ్రహశకలం కక్ష్యలో తిరిగేదని ఆయన వివరించారు. సుమారు 2500 కోట్ల విలువైన డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ నాడు అత్యంత వేగంతో ప్రయాణించి గ్రహశకలాన్ని ఢీకొంది.