అమెరికా లోని నాసా మళ్ళీ చంద్రుని మీదికి తమ ఆర్టెమిస్-1 మిషన్ ని చేబట్టాలని నిర్ణయించింది. గతంలో రెండు సార్లు ఈ మిషన్ విఫలమయింది. క్యూబా, ఫ్లోరిడాలో ఇయాన్ తుపాను కారణంగా వాతావరణం బాగులేకపోవడంతో ఈ మిషన్ విఫలమయింది. ఈ సారి నవంబరు 14 న .. మూడోసారి ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇంజనీర్లు ప్రకటించారు.
ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకువెళ్లే స్పేస్ లాంచ్ సిస్టం ని వచ్చే నెల 4 న పాడ్ మీదికి చేరుస్తామని తెలిపారు. ఇందుకు 69 నిముషాల సమయం పట్టవచ్చునని అంచనా. ఆర్టెమిస్-1 రాకెట్ లోని లోపాలను గుర్తించామని, వాటిని సరిదిద్దుతున్నామని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి కూడా ఫ్లోరిడా లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయనున్నారు.
ఈ రాకెట్ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టం లోని ఫోమ్, కార్క్ విభాగాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయని, ఇక్కడి బ్యాటరీలను రీఛార్జ్ చేయడమో, కొత్తవాటిని అమర్చడమో చేయాల్సి ఉందని వారు చెప్పారు. ఇదే సమయంలో వచ్చే నెల 14 న లాంచ్ చేయలేని పక్షంలో 16 న గానీ, 19 న గానీ ఇందుకు ప్రయత్నిస్తామని వారు వివరించారు. నవంబరు 14 న ఈ రాకెట్ చంద్రుని పైకి ఎగసిన పక్షంలో దీని మిషన్ సుమారు 26 రోజులవుతుందని, డిసెంబరు 9 న పసిఫిక్ మహాసముద్రంలో క్రాష్ కావచ్చునని ఇంజనీర్లు భావిస్తున్నారు.
2024 లో ఆర్టెమిస్-2 ని వ్యోమగాములతో ప్రయోగించాలన్నది నాసా లక్ష్యం. , అయితే వారు అంతరిక్షంలో గడుపుతారని, చంద్రునిపై కాదని నాసా వర్గాలు పేర్కొన్నాయి.