దళిత బంధు సమ్మేళనాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలను, మేధావులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని ఆయన సూచించారు.
ఈ ఏడాది అగస్టు 16తో దళిత బంధు అమలు చేసి రెండేండ్లు అవుతుంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరీంనగర్‌లో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఎమ్మెల్యే కార్యాలయ భవనాలను మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు. ఆగస్టు 16న జాతీయ దళిత బంధు సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు గురించి ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమయ్యేలా పలు కార్యక్రమాలను రూపొందించాలని సూచనలు చేశారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రతిపక్షాలతో పాటు దేశానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
సిరిసిల్లలో దేవయ్య అనే దళితుడు ఈ పథకం కింద లబ్ధిపొందారని, ఇప్పుడు ఆర్థికంగా ఆయన ఎదుగుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. దేవయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణం అద్భుతంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్‌ను కేటీఆర్ అభినందించారు.