నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీలు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు యంగ్ ఇండియా కంపెనీకి ఇచ్చిన విరాళాలపై షబ్బీర్ అలీని ప్రశ్నించారు. అయితే ఈడీ విచారణకు కొన్ని వ్యక్తిగత కారణాలతో గీతారెడ్డి, గాలి అనిల్ సోమవారం అటెండ్ కాలేదు.
గీతారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఇటీవలే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు గీతారెడ్డి. స్వల్ప వ్యవధిలోనే ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చారు. నేషనల్ హోరాల్డ్ కేసులో తన విచారణ పూర్తి అయినట్లుగా గీతారెడ్డి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్ కూడా గురువారం ఈడీ విచారణకు హాజరు కాగా.. ఆయనను 5 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు.
యంగ్ ఇండియా కంపెనీకి ఇచ్చిన విరాళాలకు సంబంధించి మొత్తం ఐదుగురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు అందడం కలకలం సృష్టించింది. షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్కుమార్లను ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వేధింపుల కోసమే ఈడీ నోటీసులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
కాగా శుక్రవారం ఇదే కేసులో కర్ణాటకకు చెందిన నేతలు డీకే శివకుమార్ ఆయన సోదరుడు డీకే సురేష్ లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఏడాది జూలైలోనే సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయాన్ని కోరారు. కరోనా కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సోనియా గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ,సోనియాలను సుమారు 50 గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు.బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ జరుపుతున్నారు.