జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీని సందర్శించనుంది. డిసెంబర్ 15న యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడం…అతిగా ప్రవర్తించిన సంఘటనపై విచారించనుంది. పోలీసులు దాడిలో గాయపడ్డ విద్యార్ధుల వాంగ్మూలాలను మానవ హక్కుల కమిషన్ రికార్డు చేయనుందని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ నజ్మా అక్తర్ తెలిపారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డిసెంబర్ 15న ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి దారి తీసింది. దీంతో పోలీసులు నిరసనకారులపై తమ ప్రతాపం చూపించారు. జామియా మిలియా యూనివర్సిటీ క్యాంపస్ లోకి ప్రవేశించి కనిపించిన విద్యార్ధినల్లా చితకబాదారు. నిరసనలతో ఎలాంటి సంబంధం లేని పలువురు విద్యార్ధులు గాయపడ్డారు. పోలీసులు కొట్టడంతో ఓ విద్యార్ధి కన్ను పోయింది. దీంతో నిరసనలు అన్ని విశ్వవిద్యాలయాలకు వ్యాపించాయి. పోలీసుల తీరును అన్ని వర్గాలు ఖండించాయి.