– తెలంగాణ మోడల్ ను ప్రమోట్ చేసుకుంటున్న టీఆర్ఎస్
– అదే స్థాయిలో గులాబీ నేతల అక్రమాలు వైరల్!
– శ్రీనివాస్ గౌడ్ ఇష్యూపై జాతీయ నేతల ఆరా?
– కేసీఆర్ ను నమ్మాలా? లేదా? అనే డైలమా?
జాతీయ రాజకీయాల పేరుతో రాష్ట్రాలు చుట్టేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బలమైన బీజేపీని ఢీకొట్టాలంటే అంతే బలంగా మనమూ ఉండాలనే కాస్పెప్ట్ తో ముందుకుపోతున్నారు. టీఆర్ఎస్ కు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ కాస్త సైగ చేస్తే విరాళాల రూపంలో కోట్లు గుమ్మరించే కాంట్రాక్టర్లు ఉన్నారు.. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే అదొక్కటే సరిపోదు. ప్రచారం చాలా ఇంపార్టెంట్. అందుకే పీకే డైరెక్షన్ లో తెలంగాణ మోడల్ అనే నినాదం ఎత్తుకున్నారు కేసీఆర్. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెగ ఊదరగొట్టేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి సంబంధించి రెండు రోజుల క్రితం ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలవడమే అందుకు నిదర్శనం.
ఒక్క ఆర్థిక వృద్ధి విషయంలోనే కాదు.. ఈమధ్య రాష్ట్రానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటోంది టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం. పీకే ప్లానింగ్ లో భాగంగా కేసీఆర్ ఇమేజ్ ను హైరేంజ్ కు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఏ విషయాన్నీ వదలకుండా వాడేస్తోంది. అయితే.. జనాలు అభివృద్ధి గురించి ఎలా మాట్లాడుకుంటారో.. ఏదైనా విషయంలో తేడా వస్తే దాని గురించి కూడా అంతే స్థాయిలో చర్చించుకుంటూ ఉంటారని… దానికి ఉదాహరణే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ప్లాన్ కేసని అంటున్నారు రాజకీయ పండితులు.
మంత్రిని చంపేందుకు ప్లాన్ చేశారంటూ ఆరుగుర్ని అరెస్ట్ చేసి.. ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలను వెల్లడించారు సైబరాబాద్ సీపీ. అయితే.. ఇక్కడే చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తమ భర్తలు కిడ్నాప్ అయ్యారంటూ కొద్ది రోజుల క్రితం వారి భార్యలు మహబూబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు ఇస్తే వారిని వెతికిపెట్టే విషయాన్ని పక్కన పెట్టి.. మంత్రి హత్యకు ప్లాన్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నారు విశ్లేషకులు. పైగా దీనికి రాజకీయ లింకులు కలిపి బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం జనాలు నవ్వుకునేలా చేసిందని చెబుతున్నారు.
మంత్రి హత్యకు కుట్ర చేశారని చెబుతున్న వారిలో శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్నారని.. చాలాకాలంగా పోరాటం చేస్తున్నవారు ఉన్నారు. అఫిడవిట్ విషయంలో కోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి.. అలాంటి వారు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర చేశారనే కేసును తెరపైకి తీసుకురావడం కావాలనే చేసిందిగా అనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ పండితులు. అయితే.. జాతీయ రాజకీయాలని తిరుగుతున్న కేసీఆర్.. అభివృద్ధి గురించి ఎంత చెప్పుకుని ప్రచారం చేసుకున్నా.. తన పార్టీ నేతల అక్రమాలకు సంబంధించి ఎన్ని విషయాలు బయటకు వచ్చినా పట్టించుకోకపోవడం జాతీయ స్థాయి నాయకులకు తెలయకుండా ఉండదని హెచ్చరిస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో ఆయనకు తలనొప్పిని తీసుకురావడం ఖాయమని చెబుతున్నారు.
ఈటల రాజేందర్ పై గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకున్న కేసీఆర్.. తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఇతర నేతల మీద చర్యలు తీసుకునే విషయంలో అనుసరిస్తున్న వైఖరి.. ఆయన చెప్పే మాటల స్థాయికి తగ్గట్లు ఉన్నాయా? లేవా? అనేది జాతీయ స్థాయి నాయకులు అన్నింటినీ బేరేజు వేసుకుని ముందుకు వెళ్తారని అంటున్నారు విశ్లేషకులు. మంత్రిపై ఫిర్యాదు చేసిన వారిపైనే హత్యాయత్నం కేసు నమోదు కావడం చూస్తుంటే.. కేసీఆర్ చెప్పే ఆదర్శాలకు, చేతలకు తేడా ఉందన్న అభిప్రాయం అందరిలో వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.