ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. జాతీయ స్థాయి ఖో-ఖో ప్లేయర్ దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం ఓ స్కూల్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె.. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజుకల్లా బిజ్నూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బాధితురాలు తీవ్రమైన గాయాలతో, అత్యంత ఘోరమైన స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. బాధితురాలని హత్య చేసిన దుండగులు.. తానుండే ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో పడేసి వెళ్లిపోయారు. నజీబాబాద్ రైల్వే పోలీసులు (GRP) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తొలుత ఆమెను చూసినప్పుడు శరీరంపై ఉన్న దుస్తులు పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. ముఖం నిండా గాయాల గుర్తులు ఉన్నాయి. పళ్లు విరిగిపోయాయి. మెడ విరిచేసినట్టుగా ఉంది. దీంతో కచ్చితంగా అత్యాచారం చేసి ఉంటారని, ప్రతిఘటించడంతోనే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
పోస్ట్‌మార్టం రిపోర్టులో గొంతు నులిమి చంపేశారని, ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోస్టుమార్టం నివేదికతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.