మన తిరుగుబాటు చరిత్రాత్మకమని… ఒక జాతీయ పార్టీ పొగిడిందని శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే అన్నారు. అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్‌లో మకాం వేసిన ఆయన, తన వెంట ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. మనందరికీ సాయం చేస్తానని ఆ పార్టీ భరోసా ఇచ్చిందన్నారు.
‘మన బాధలు, సంతోషాలు ఒకటే. మనం అంతా కలిసే ఉన్నాం. విజయం మనదే. మహాశక్తి అయిన ఒక జాతీయ పార్టీ ఉంది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ పొగిడింది. అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసా ఇచ్చింది’ అని అన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఏక్‌నాథ్ షిండే కార్యాలయం ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక నుంచి తమ తరుఫున నిర్ణయాలు తీసుకోవాలని ఆయనను నేతలు అడుగుతున్నట్లుగా అందులో ఉంది.
మరోవైపు ఏక్‌నాథ్ షిండే వెంట 37 మంది శివసేన ఎమ్మెల్యేలతోపాటు 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 46 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే రాయబారం కోసం సూరత్‌కు పంపిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక అనుచరుడు కూడా రెబల్ బృందంలో చేరినట్లు తెలిసింది.