మల్కాజిగిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించి, దాడి చేశారని అందిన ఫిర్యాదు మేరకు.. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు అరుణ్ హల్దార్ బాధితులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ కూడా ఉన్నారు.
దళిత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేయడం తీవ్రమైన అంశమని… నిందితులు ఎంతటివారైనా 24 గంటల్లో అరెస్ట్ చేయాలన్నారు అరుణ్ హల్దార్. అలా చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక మైనంపల్లిని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు భానుప్రకాష్. కార్పొరేటర్ శ్రవణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన నిరసనలు కొనసాగిస్తున్నారు. మైనంపల్లికి పోలీసులు వంతపాడుతున్నారని.. అదేమని అడిగితే ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. మైనంపల్లి అక్రమాలన్నీ అరుణ్ హల్దార్ కు బాధితులు వివరించారని చెప్పారు. తనను బెదిరిస్తున్నారని.. దేనికైనా రెడీ అంటూ మైనంపల్లికి సవాల్ విసిరారు భానుప్రకాష్.