రాజధాని పరిధిలోని తుళ్లూరులో జాతీయ మహిళా కమిషన్ విచారణ నిర్వహించింది. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.
మహిళలపై లాఠీ చార్జీ, దాడి ఘటనలకు సంబంధించి తుళ్లూరు తహసీల్దార్, డీఎస్పీతో కమిషన్ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుళ్లూరు గ్రామానికి చేరుకునే ముందు మార్గ మధ్యంలో మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు.పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను మహిళా కమిషన్ సభ్యులకు వివరించేందుకు తుళ్లూరు మహిళలు భారీగా తరలివచ్చారు. పోలీసులు తమను ఏవిధంగా హింసించిందీ మహిళలు కమిషన్ ఎదుట ఏకరువు పెట్టారు. దాడి ఘటనకు సంబంధించి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన కొన్ని దృశ్యాలను కమిషన్ సభ్యులకు చూపించారు. ఉదయం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన మహిళలను రాత్రి 9 గంటలకు విడిచిపెట్టారని తెలిపారు. అర్ధరాత్రి 2 గంటలకు సివిల్ డ్రసులో తన నివాసంలోకి వచ్చారని సిసి కెమెరాకు చిక్కారి మరో మహిళ తెలిపింది. తమ గ్రామ దేవస్థానాలకు తాళాలు వేశారని కావాలంటే స్వయంగా చూడవచ్చు అని మహిళ తెలిపింది.