నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవాధ్యక్షులు
“విశాఖ ఉక్కు” ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు పార్లమెంటును స్తంభింప చేసి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేయాలి. ఏపీలో “రైల్వే జోన్” అందని ద్రాక్షలా మారింది…”వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్స్” ప్రకటనలకే పరిమితమయ్యాయి… మన్నవరం బెల్ ప్రాజెక్ట్,దుగ్గరాజ పట్టణం ఓడరేవు “దింపుడు కళ్లెం ఆశలా” మారింది.
ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలోని హామీలను సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు చివరి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకొని సాధించకపోతే “చరిత్ర హీనులు”గా మిగిలిపోతారు. ఏపీ లో అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సర పుణ్యకాలం పూర్తవుతున్నా ఒకరిద్దరు ఎంపీలు తప్ప మిగతా ఎంపీలు అసలు పార్లమెంట్ లో ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అని ఓటేసిన ప్రజలు నిర్మొహమాటంగా ప్రశ్నించడం సిగ్గుచేటు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఎంపీలను పార్లమెంట్ సమావేశాలలో “భూతద్దం” పెట్టి వెతికినా కనపడటం లేదు,పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సకాలంలో సద్వినియోగ చేసుకోకపోవడం శోచనీయం. ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు జెండాలు అజెండాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్టుకు నిధులు,అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి సాధించాలి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన కొంతమంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో తిష్ట వేసి సొంత వ్యాపారాలు,ఇతర రాష్ట్రాలలో కాంట్రాక్టులు చేసుకుంటూ తమ MP పదవులను “పార్ట్ టైం జాబ్” లా అనుభవిస్తున్నారే తప్ప ఏపీకి వారి వల్ల ఒరిగింది “శూన్యం”.ఏపీలో పులిలా గాండ్రిస్తూ ఢిల్లీలో పిల్లిలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా,రైతు వ్యతిరేక చట్టాలకు సంపూర్ణ మద్దతు తెలియజేయడంలోని శ్రద్ధ కేంద్రం నుంచి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధులు,బకాయిల మీద కొంతైనా దృష్టి పెట్టకపోవడం ఏపీ కి ద్రోహం చేయడమే.
రాయలసీమలో ఉక్కు కర్మాగారానికి వేసిన పునాదికి కేంద్ర సహకారం, నిధులు లేక పాలకులను వెక్కిరిస్తూ వెలవెల పోతున్నా సీమ ప్రాంత నాయకులకు “చీమకుట్టినట్లైనా” లేకపోవడం శోచనీయం.రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్తున్నారు ప్రధానికి లేఖలు ఇస్తున్నారే తప్ప కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ఏ ఒక్క విషయంలో కూడా సానుకూల స్పందన రాకపోవడం శోచనీయం.
రాష్ట్రం నుంచి కోట్లాది రూపాయలు “జీఎస్టీ” రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నారు అయినా ప్రతి నెల ఆర్థిక మంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ కు రావలసిన నిధులు కేటాయింపుల విషయంలో పార్లమెంటును స్తంభింపజేసి మీకు ఓటు వేసిన ప్రజలకు మా ఎంపీ పార్లమెంటు సాక్షిగా పోరాడాడు అనిపించేలా గట్టిగా ప్రయత్నం చేసి సాధించాలని డిమాండ్ చేస్తున్నాను.