నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
కాంగ్రెస్ నేత
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవాధ్యక్షులు
అధికార,ప్రతిపక్షాల బహిరంగ సభలలో ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరగడం,గాయాలవడం బాధాకరం అలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికారులు,ప్రభుత్వం సూచనలు చేయలే తప్ప …ఏకంగా ర్యాలీలు బహిరంగ సభలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1 ఇవ్వడం ప్రజాస్వామ్యానికి “గొడ్డలి పెట్టు”.
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలతో పాటు ప్రతిపక్షాలు సైతం అభినందించే విధంగా ఉండాలి. పదికాలాలపాటు ప్రజల సంక్షేమం కోసం అమలు జరిగే విధంగా ఉండాలే తప్ప అన్నీ వర్గాల ప్రజలు బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించే విధంగా ఉండకూడదు. !
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల హక్కులకు భంగం కలిగించినప్పుడు, అలాగే రాష్ట్ర ప్రజలపై అన్ని వర్గాల వ్యాపారస్తులపై పన్నుల భారం మోపినప్పుడు, కొన్ని సందర్భాలలో అవినీతి అధికారులు వేధింపులకు గురి చేసినప్పుడు, ప్రతిపక్షాలతో సైతం ఉద్యోగస్తులు ప్రజాసంఘాలు ప్రజలు వ్యాపారస్తులు రోడ్ల మీదికి వచ్చి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఏపీలో ఉండకూడదు అన్న నిరంకుశ ధోరణితో ఉక్కు పాదంతో అణిచివేయడం అన్యాయం.
పరమానందయ్య శిష్యుల కథలో శిష్య బృందం తలనొప్పి వస్తే తల తీసేస్తాం, కాలు నొప్పి వస్తే కాలు తీసేస్తాం అన్న చందంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది.రాజకీయ పార్టీలు ప్రజల ప్రాణాలు తీసేందుకు బహిరంగ సభలు, ర్యాలీలు పెట్టరు అన్న విషయాన్ని ప్రభుత్వ సలహాదారులు పాలకులు గుర్తించాలి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఎన్నో యాత్రలు చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దీక్షలు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు చేసే తప్పులను,అవినీతిని బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేసి అవినీతి చక్రవర్తులను గద్దె దించడం “ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్ర కీలకం”.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ఇవ్వడం అంటే ఏపీలో అధికార పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలలో నమ్మకం లేదు అన్న అభద్రతాభావమే కారణం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ఇచ్చిన జీవో నెంబర్ 1 ని ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు,మేధావులు, ఉద్యోగ సంఘ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించక ముందే గౌరవంగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.