పంజాబ్ పాలిటిక్స్ మరోసారి ఇంట్రస్టింగ్ గా మారాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించారు. పీసీసీ చీఫ్ పదవి వదిలినా… పార్టీకి తన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఏదైనా విషయంలో ఒక వ్యక్తి రాజీపడితే అతడి వ్యక్తిత్వం కోల్పోయినట్లు భావిస్తామని.. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం విషయంలో తాను ఎప్పటికీ రాజీపడనని తెలిపారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
— Navjot Singh Sidhu (@sherryontopp) September 28, 2021
అమరీందర్ తో విభేదాలు నడుస్తున్న సమయంలోనే పీసీసీ పగ్గాలు చేపట్టారు సిద్ధూ. అయితే ఆయన అధ్యక్షుడు కావడం.. అధిష్టానం అండగా ఉండడం.. కెప్టెన్ కు నచ్చలేదు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను భరించలేక ఆఖరికి సీఎం పదవికి రాజీనామా చేశారాయన. అప్పుడు సిద్ధూనే ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ సమయంలో అమరీందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో సిద్ధూకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన సీఎం అయితే రాష్ట్రానికే కాదు దేశానికే ప్రమాదమన్నారు. అధిష్టానం కూడా అన్నీ ఆలోచించి… చరణ్ జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది.
గొడవలన్నీ సద్దుమణిగాయి అనుకున్న తరుణంలో అమరీందర్ బీజేపీ గూటికి చేరుతున్నారనే వార్తలు బయటకొచ్చాయి. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. ఇది వ్యూహాత్మకంగానే జరిగిందని అంటున్నారు రాజకీయ పండితులు. అమరీందర్ జారిపోకుండా చేసే ప్రయత్నమేనని భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ వెళ్లిపోతే పార్టీకి పెద్ద నష్టమే. అందుకే సిద్ధూ చేత రాజీనామా చేయించి ఉంటారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
మరోవైపు సిద్ధూ రాజీనామాపై స్పందించారు అమరీందర్.. ‘నేను ముందే చెప్పా.. ఆయన నిలకడ ఉన్న మనిషి కాదు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ కు సరైన వ్యక్తి కాదు’ అంటూ సిద్ధూను ఉద్దేశించి ట్వీట్ చేశారు కెప్టెన్ అమరీందర్.
I told you so…he is not a stable man and not fit for the border state of punjab.
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 28, 2021
Advertisements