పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఈ శిక్ష కాలంలో సిద్ధు క్లర్క్‌గా పని చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ముప్పై ఏళ్ల కిందట ఓ వృద్ధుడిపై దాడి చేసి అతని మరణానికి కారణమైన కేసులో సుప్రీం కోర్టు ఏడాది పాటు నవజోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష విధించింది.
సిద్ధూ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా సిద్ధూకు క్లరికల్ వర్క్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల తర్వాతే సిద్ధూకు ఉద్యోగ వేతనం ఇవ్వనున్నారు. అప్పటి వరకు సిద్ధూను ట్రైనీగా పరిగణిస్తారు. రోజుకు రూ.40 నుంచి రూ.90 మధ్య రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు.
తనకు కేటాయించిన సెల్ లోనే నవజోత్ సింంగ్ సిద్ధూ క్లర్క్ గా వర్క్ చేయనున్నారు. ఆ గదికే అధికారులు ఫైల్స్ పంపనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు..మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సిద్ధూ రెండు షిఫ్టుల్లో పని చేయనున్నారు.
కోర్టు తీర్పులను బ్రీఫింగ్ చేయడంతో పాటు జైలు రికార్డులను రాయడం వంటి పనులను సిద్ధూ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సిద్ధూ ఈ రైటింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. కాంగ్రెస్ నేత సిద్ధూ పేరును ఖైదీ నెంబర్ 241383గా రికార్డు చేశారని, ఆయనకు బ్యారక్ నంబర్ 7గా కేటాయించినట్లు తెలుస్తోంది.