భారత నౌకా దళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్)ధ్రువ్‌కు ప్రమాదం తప్పింది. ముంబై తీరానికి సమీపంలో ఏఎల్‌హెచ్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తీరానికి సమీపంలో ముగ్గురు సిబ్బందిని పెట్రోలింగ్ హెలికాప్టర్ సురక్షితంగా కాపాడినట్టు అధికారులు పేర్కొన్నారు.
రోజు వారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఈ రోజు ఉదయం ఏఎల్‌హెచ్ నేవీ బేస్ నుంచి బయలు దేరినట్టు ఇండియన్ నేవి తెలిపింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఏఎల్ హెచ్ ముంబై తీరానికి సమీపంలో ల్యాండ్ అయినట్టు చెప్పింది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు వెల్లడించింది.
అనంతరం వారిని తమ పెట్రోలింగ్ క్రాఫ్ట్ హెలిక్యాప్టర్ గుర్తించి సురక్షితంగా తీసుకు వచ్చిందని ట్వీట్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొంది. గతేడాది కూడా ఏఎల్ హెచ్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్‌లో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
అంతకు ముందు భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ఒకటి కశ్మీర్ లోని గురేజ్ సెక్టార్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మరణించాడు. దీనిపై ఆర్మీ స్పందిస్తూ… గాయపడిన సైనికులను తరలిస్తున్న సమయంలో చీతా హెలికాప్టర్ కూలిపోయినట్టు ట్వీట్ చేసింది.