నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న హారర్ సినిమా కనెక్ట్ తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేశారు. గురువారం అర్థరాత్రి 12న గంటలకు ఈ ట్రైలర్ రిలీజైంది. హారర్ అంశాలతో ఆద్యంతం భయపెడుతూ ఈ ట్రైలర్ సాగింది. ఇందులో నయనతార, వినయ్‌రాయ్ భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు.
నయనతార తండ్రిగా సత్యరాజ్ కనిపిస్తున్నారు. తమ కూతురు అమ్ముతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ దయ్యం ఎలాంటి కల్లోలాన్ని రేపిందో ట్రైలర్‌లో థ్రిల్లింగ్‌గా చూపించారు. లాక్‌డౌన్ టైమ్‌లో సాగే కథ కావడంతో ఫోన్ స్క్రీన్స్ ద్వారానే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు చూపించారు.
కరోనా పాజిటివ్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చినట్లుగా నయనతార…సత్యరాజ్‌తో చెప్పడం, ఆ ఇంట్లోనే దయ్యం ఉన్నట్లుగా చూపించడం ఉత్కంఠను పంచుతోంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు అంటూ కూతురు అమ్మును కాపాడుకోవడానికి ఆరాటపడే తల్లిగా నయనతార నటన ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చివరలో అనుపమ్‌ఖేర్ కనిపించారు.
99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.