కాస్టింగ్ కౌచ్ గురించి చిన్న చిన్న హీరోయిన్లు ఓపెన్ అవుతుంటారు. పెద్ద హీరోయిన్లు మాత్రం ఏం జరగనట్టు వ్యవహరిస్తుంటారు. అబ్బే.. అలాంటిదేం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయోమో అని వీళ్ల భయం. ఇక అవకాశాలు రావని నిర్ణయించుకున్న హీరోయిన్లు మాత్రమే ఇలా ఓపెన్ అయ్యారు.
అయితే నయనతారకు ఈ భయం లేదు. ఆమె లేడీ సూపర్ స్టార్. వద్దంటే అవకాశాలొస్తాయి, ఆమెకంటూ కోలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా మాట్లాడింది నయనతార.
కెరీర్ ప్రారంభంలో తను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని ఎదుర్కొన్నానంటోంది నయనతార. ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందట. అయితే ఆ సినిమా మేకర్స్ మాత్రం కొన్ని కండిషన్లు పెట్టారు. చెప్పినట్టు నడుచుకోవాలని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు రావాల్సి ఉంటుందంటూ కండిషన్స్ పెట్టారట.
వాళ్ల మాటల్లో అంతరార్థం ఏంటో నయనతారకు ఈజీగానే తెలిసిపోయింది. అందుకే పెద్ద సినిమా అయినప్పటికీ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందంట. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టిన నయనతార, ఆ పెద్ద సినిమా ఏంటనేది మాత్రం చెప్పలేదు.