నయనతార ప్రచారం చేయడం ఎప్పుడైనా చూశామా. సినిమాలు చేయడం వరకు మాత్రమే ఆమె పని. ప్రచారానికి పూర్తిగా దూరం. ఆ మేరకు అగ్రిమెంట్ లో కూడా స్పష్టంగా రాయిస్తుంది నయనతార. రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని కూడా ప్రమోషన్ కు రాకపోవడం అన్యాయం అంటూ నిర్మాతలు లబోదిబోమంటున్నా నయనతార కనికరించదు. మరీ అంత కష్టమైతే ముందే సినిమా నుంచి తప్పుకుంటుంది. ఈ విషయంలో తను ఇబ్బంది పడదు, మరొకర్ని ఇబ్బంది పెట్టదు.
ఇలా ప్రచారం విషయంలో చాలా కఠినంగా వ్యవహరించే నయనతార, ఇన్నేళ్ల కెరీర్ లో తొలిసారి తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే ఓ బడా సినిమా ప్రచారంలో కనిపించబోతోంది. అదే గాడ్ ఫాదర్. అవును.. చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రచారానికి నయనతార వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ, ఆమె ప్రమోషన్ కు వస్తే మాత్రం అదో పెద్ద రికార్డ్ అవుతుంది.
అజిత్, రజనీకాంత్ లాంటి పెద్ద హీరోల సినిమాల ప్రచారానికే నయనతార ఎప్పుడూ వెళ్లలేదు. అలాంటిది చిరంజీవి సినిమా ప్రమోషన్ కు ఆమె వస్తే ఆ సినిమాకే అది పెద్ద ఎస్సెట్ అవుతుంది. ఈ మేరకు నయనతారను మేకర్స్ ఒప్పించినట్టు కథనాలు వస్తున్నాయి.
మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ కు రీమేక్ గా వస్తోంది గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లు. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.