తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలోని నయీంకు చెందిన ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేసినా న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. అతడి భార్య, సోదరి, అత్త, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ.12 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ.9 కోట్లు. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ.10 కోట్లు. షాద్ నగర్ లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్ ల విలువ సుమారు రూ.50 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ.60 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్ లో రూ.5 కోట్ల విలువైన వెంచర్.. నల్లగొండలో నయీం అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ.6 కోట్లు. మిర్యాలగూడలో నయీం అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ.4 కోట్లు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180కిపైగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుంది.
గోవాలోని కోకనట్ హౌస్ తోపాటు మరో ఇల్లు గుర్తించారు. ఒక్కో ఇంటిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీం భార్య, సోదరి వాంగ్మూలం ఇచ్చారు. నాగోల్, సరూర్ నగర్ లో ఓ సెటిల్ మెంట్ లో నయీం అనుచరులు శేషన్న, శ్రీధర్‌ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ.10 కోట్లు. నార్సింగిలో రూ.4 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్ లోని పోలీస్ హౌస్ విలువ రూ.4 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ.6 కోట్లు. మేడ్చల్ లో 3 ఎకరాలు రూ.10 కోట్లు. శామీర్ పేట్ లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాలు ఓ ప్రజాప్రతినిధితో చేసిన సెటిల్ మెంట్ లో పొందిన భూమి విలువ సుమారు రూ.20 కోట్లు. మొయినాబాద్ లో కోటి విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్ లోని అజీజ్ నగర్ ల్యాండ్ సెటిల్ మెంట్ తో వచ్చాయని పోలీసులే తెలిపారు. ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్ లో సుమారు రూ.4 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. ఇవేకాకుండా మరో లెక్క తేలని 200 ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తాన్ని పోలీసులు జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలి. కానీ.. ఐదేళ్లు అయినా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
నయీం కుటుంబంతో టీఆర్ఎస్ నాయకులు టచ్ లో ఉండి అస్తులను ఎవరికీ దక్కకుండా చేయాలని లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. పోలీసుల ఫిర్యాదులో 210 మంది బాధితులు నిజమని తేలింది. కానీ.. 46 మందికే లీగల్ గా ఫైట్ చేస్తే న్యాయం జరుగుతుందని తెలుస్తోంది. 20 ఏళ్ల నుంచి భూ దందాల్లో చేతులు మారడంతోనే లీగల్ గా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. నిజమైన బాధితులకు పోలీసులు న్యాయం చేయడం కష్టంగానే కనిపిస్తోందని చెబుతున్నారు.
నయీం కేసుల్లో అంతుచిక్కని అంశం ఆయుధాలు. చిన్నపాటి మారుణాయుధం ఉంటేనే అరెస్ట్ చేస్తారు పోలీసులు. అలాంటిది 11 ఏకే 47లు, 21 పిస్టల్స్ నయీం దగ్గరకు ఎలా వచ్చాయి. 2003 నుంచి 2016 మధ్య ఇవి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నయీం భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరా, అత్త సుల్తానా, బావమరిది సాదిక్ ల వద్ద 3 ఏకే 47లు, ఒక కార్బైన్, 2 పిస్టల్స్ ఉండేవి. అతడి పర్సనల్ సెక్యూరిటీ అమీనా, అనుచరులు శ్రీధర్ గౌడ్, శ్రీధర్ రాజు, శేషన్న, పాశం శ్రీను, రాంబాబు, గోపన్న, ఈశ్వరయ్యల వద్ద ఏకే 47లు ఉండేవి. ప్రతీ ఒక్కరి వద్ద అదనంగా పిస్టల్ కూడా ఉండేది. ఏకే 47లను కారులో కనబడకుండా పట్టుకునే వీరు.. పిస్టళ్లను లోదుస్తుల్లో దాచుకునేవారు. 2014 నుంచి 2016 ఆగస్టు వరకు దందాలు చేసేందుకు షాద్ నగర్ లోని ఇందిరా పార్క్ నివాసాన్ని వాడుకున్నారు. యాంజాల్ శివారులోని ఇంజాపూర్‌లో ఉన్న నివాసంలోనూ సెటిల్ మెంట్లు చేశారు. అక్కడే ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్న అధికారి.. నయీం ఎక్కడ ఉంటే అక్కడ డ్యూటీలు వేయించుకుని చక్రం తిప్పేవాడనేది బహిరంగ సమాచారమే.
ఐసిస్ ఉగ్రవాది షాహీద్ ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఆయుధాల డీలర్ అర్ఖాన్ బాయ్ అలియాస్ యుజవార్ ను నయీంకు పరిచయం చేశాడు. అలా అర్ఖాన్ ద్వారా నయీంకు ఆయుధాలు అందాయి. నయీం వాటిని మావోయిస్టుల హత్యలకు, భూ దందాలకు వినియోగించుకున్నాడు. 2003లో అర్ఖాన్ కు రూ.10 లక్షలు చెల్లించి.. 2 ఏకే 47లు, 2 పిస్టళ్లను తెప్పించాడు. ఆ డబ్బును తన అక్క సలీమా అర్ఖాన్ కు అందించింది. తర్వాత 2006లో 15 లక్షలు ఇచ్చి మరో 2 ఏకే 47లు, 4 పిస్టళ్లను గోవాలోని తన చర్చి హౌస్ కు తెప్పించాడు. 2008లో అర్ఖాన్ రూ.20 లక్షలు తీసుకుని మరో 2 ఏకే–47లను ఇంజాపూర్ లోని నయీం అడ్డాకు తెచ్చి ఇచ్చాడు. 2013లో శంషాబాద్ లోని రైల్వేహౌజ్ లో ఇంకో 2 ఏకే 47లు, 2 పిస్టళ్లు ఇచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లాడు. 2015లో రూ.20 లక్షలు తీసుకుని ఒక ఏకే–47, ఒక కార్బైన్, 4 పిస్టళ్లను తెచ్చి ఇచ్చాడు. ఇవికాకుండా ఛత్తీస్ గఢ్ లో 2 సందర్భాల్లో 2 ఏకే 47లను, 4 పిస్టళ్లను, ప్రకాశంలో ఉన్నప్పుడు 2 పిస్టళ్లను నయీం తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది.
మొత్తంగా నయీం దాదాపు కోటిన్నర వరకు చెల్లించి.. 11 ఏకే 47లు, 21 పిస్టళ్లను తెప్పించాడు. ఎన్ కౌంటర్ తర్వాత అలకాపురి కాలనీ ఇంట్లో ఒక కార్బైన్, 169 రౌండ్ల బుల్లెట్లు, 10 జిలెటెన్ స్టిక్స్ దొరికాయి. శంషాబాద్, ఇంజాపూర్ లలోని ఇళ్లు, తుక్కుగూడ ఫాంహౌస్ ఇలా మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. నయీం ఎన్ కౌంటర్ అయిన ప్రాంతంలో ఒక ఏకే 47ను, అతడి అనుచరులు శ్రీధర్ గౌడ్, పాశం శ్రీనుల వద్ద 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. నయీం వద్ద 11 ఏకే 47లు, 21 పిస్టళ్లు ఉన్నట్లు లెక్క.. మరి పోలీసులకు దొరికింది ఒక్క ఏకే 47, 6 పిస్టళ్లు మాత్రమే. నయీం షాద్ నగర్ డెన్ కు వెళ్లే ముందు రోజు అతడి భార్య, అక్క, అనుచరుల వద్ద ఏకే 47లు ఉన్నాయి. కానీ.. సోదాల సమయంలో మాత్రం లభించలేదని పోలీసులు చెబుతున్నారు. సీజ్ చేసినట్లుగా పేర్కొన్న ప్రాపర్టీల్లో ఆయుధాల వివరాలను పూర్తిగా చూపకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.