హీరో కెరీర్ లో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు. ఎలాగోలా నెట్టుకొస్తాడు. హీరోయిన్ కెరీర్ లో బ్రేకులొస్తే మాత్రం ఫేడ్ అవుట్ అయినట్టే. కానీ.. అదృష్టం కొద్దీ నజ్రియాకు మాత్రం ఇంకా ఫేడ్ అవుట్ స్టేజ్ కు రాలేదు. తాజాగా తన కెరీర్ గ్యాప్స్ పై స్పందించింది ఈ బ్యూటీ.
“బ్రేక్ నేను ప్లాన్ చేసింది కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాను. టీవీకి పని చేశాను. ఒక రెండేళ్ళు వరుసగా సినిమాలు చేశాను. కొంచెం త్వరగానే పెళ్లి చేసుకున్నాను. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత దానికి సమయం కేటాయించాలని భావించాను. ఇంట్లో ఉండటం, ప్రయాణాలు, ఇంటి పనులు చూసుకోవడం కూడా ఆనందంగా ఉంది. అయితే.. ఫాహద్ ‘కథలు వినకుండా ఏం చేస్తున్నావ్’ అనేవారు(నవ్వుతూ). నన్ను తెరపై చూడటం ఆయనకు చాలా ఇష్టం. నాకంటే ఆయనే ఎక్సయిట్ గా ఉంటారు. కొన్నాళ్ళుగా కథలు వింటున్నాను. అయితే.. నేను ఆల్రెడీ చేసిన పాత్రలే చాలా వరకూ వచ్చాయి. చేసిన పాత్రే మళ్ళీ చేయడంలో ఎలాంటి ఎక్సయిట్ మెంట్ ఉండదు కదా.. ఈ కారణంగా కథల ఎంపికలో నేను కొంత ప్రత్యేకంగా ఉంటానని భావిస్తారు.”
అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆమె లీలా థామస్ అనే పాత్ర పోషించింది. లోపల బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించనీయని పాత్ర అది.
ఈ పాత్రను దర్శకుడు వివేక్ ఆత్రేయ అద్భుతంగా డిజైన్ చేశాడని చెబుతోంది నజ్రియా. నిజ జీవితంలో నజ్రియాకు, లీలాకు ఎలాంటి పోలిక లేదంటోంది. శక్రవారం థియేటర్లలోకి వస్తోంది అంటే సుందరానికి సినిమా.