రాష్ట్రపతి ఎన్నికల బరి నుంచి మరో సీనియర్ నేత తప్పుకున్నారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దులా ప్రకటించారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జాబితా నుంచి తన పేరును తొలగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తాను అక్కడే ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్ కు మరెన్నో సేవలను తాను చేయాల్సి వుందన్నారు. అందుకే తాను పోటీ నుంచి తప్పుకోనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి పదవికి తన పేరును ప్రతిపాదించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు.
తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ చాలా మంది ప్రతిపక్ష నేతలు ఫోన్లు చేశారని చెప్పారు. వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల తరఫున పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.