దేశంలో మాదకద్రవ్యాలను నాశనం చేయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ డ్రైవ్ చేబట్టింది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను అస్సాంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో నాశనం చేశారు. ఆయన వర్చ్యువల్ గా చూస్తుండగా దాదాపు 40 వేల కేజీల మాదకద్రవ్యాలను ఈ సంస్థ సిబ్బంది నాశనం చేశారు.
అస్సాంతో బాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్టాల్లో ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది వీటిని స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ పైన, దేశ భద్రతపైన జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు, ఈ సమావేశంలో ఈ రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు పాల్గొన్నారు.
ఎన్సీబీ ఆధ్వర్యంలో 75 వేల కేజీల మాదకద్రవ్యాలను నాశనం చేయాలన్నది లక్ష్యమని, కానీ దీనికి బదులు లక్షన్నర కేజీల డ్రగ్స్ ను నాశనం చేయడం ముదావహమని ఈ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు. వీటిలో హెరాయిన్ సహా వివిధ రకాల మాదకద్రవ్యాలున్నాయని అన్నారు. సమాజాన్ని డ్రగ్స్ రహితమైనదిగా చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మాదకద్రవ్యాల పై నిరంతరం పోరు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తమ సంస్థ నాశనం చేసిన మాదకద్రవ్యాల వివరాలను ఎన్సీబీ అధికారులు వివరించారు.