భారత్ లోకి పాకిస్తాన్ నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతుంటుంది. దేశ యువతను నాశనం చేయాలనే లక్ష్యంగా ఉగ్రమూకలు డ్రగ్స్ దందా నడిపిస్తుంటాయి. దీనికి సంబంధించిన చాలా ఘటనలు వెలుగుచూశాయి. అయితే.. హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ కు డ్రగ్స్ రవాణా అవుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. పటాన్ చెరులోని లూసెంట్ డ్రగ్స్ కంపెనీ ఈ దందా సాగిస్టున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది.
2,500 కిలోల ట్రమడాల్ మత్తు మందును లూసెంట్ కంపెనీ అక్రమంగా సరఫరా చేసినట్టుగా తేల్చారు అధికారులు. ఒక్క పాకిస్తాన్ కే కాదు.. డెన్మార్క్, జర్మనీ, మలేషియాలకు కూడా ఈ డ్రగ్స్ పంపినట్లుగా ఇన్వాయిస్ ల ద్వారా తెలుసుకున్నారు.
ట్రమడాల్ ఎగుమతులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎన్సీబీ.. సంగారెడ్డిలోని లూసెంట్ కంపెనీలో సోదాలు నిర్వహించింది. దీంతో అసలు గుట్టంతా బయటపడింది. ఈ కంపెనీ ఒక సంవత్సరంలో 25,000 కిలోల వరకు ట్రమడాల్ ను పాక్ కు ఎగుమతి చేసినట్లు తేలింది.
దొడ్డిదారిన పాకిస్తాన్ కు డ్రగ్స్ పంపిన లూసెంట్ డ్రగ్స్ కంపెనీ ఎండీతోపాటు నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. ఈ ఐదుగురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.