మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిందో లేదో అప్పుడే అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం మొదలైనట్టే అనిపిస్తోంది. రాష్ట్రానికి కొత్త సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, షిండేపై విమర్శలు చేశారు. అదే సమయంలో ఇటు పవార్ కు ఆదాయపు విభాగం నుంచి ఐటీ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ లో వెల్లడించారు.
‘‘నాకో ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి ఈ ప్రేమ లేఖ వచ్చింది’’ అని పవార్ ట్వీట్ చేశారు. అయితే.. ఇందులో తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. వాటికి సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని తెలిపారు పవార్. అయితే.. ఆ నోటీసులను ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అయితే.. ఈ నోటీసులపై ఎన్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే.. తమ పార్టీ అధ్యక్షుడికి ఐటీ నోటీసులు రావడంపై మండిపడుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా..? లేదా దీని వెనుక ఇంకేమైనా కుట్ర జరుగుతోందా..? అని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ ప్రశ్నించారు.
మరోవైపు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఇటీవల ఈడీ నోటీసులు వచ్చాయి. ఓ వైపు మహారాష్ట్రలో సంక్షోభ పరిస్థితులు కొనసాగుతుండగానే.. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. సంజయ్ రౌత్ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో.. ముంబయిలోని గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్ కు సమన్లు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.