బలపరీక్షకు ముందే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామాను ముఖ్యమంత్రి ఫడణవీస్ కు సమర్పించినట్టు సమాచారం. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ బీజేపీతో జత కట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించారు. ఈ విషయంపై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దీంతో 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఈరోజు ఫడణవీస్ సర్కార్ ను ఆదేశించింది. మరో వైపు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి 162 మంది సభ్యుల మద్ధతు ఉందని ఆ మూడు పార్టీల కూటమి ప్రకటించింది. మద్ధతునిచ్చే ఎమ్యెల్యేలందరితో దిగిన గ్రూప్ ఫోటోను విడుదల చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో రేపు 10 గంటల్లోపు బలనిరూపణ చేసుకోవాల్సి వుండడం..మెజార్టీ లేకపోవడంతో బీజేపీ అయోమయంలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు వెలవడగానే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి భేటీ అయి మహారాష్ట్ర గురించి చర్చించినట్టు తెలిసింది. అప్పుడే వారు ఫడణవీస్ కు ఓ మెస్సేజ్ ను కూడా పంపినట్టు సమాచారం. ఆ మెస్సేజ్ లో ఏముందనేది అధికారికంగా ఎవరూ బయటకు వెల్లడించకపోయినప్పటికీ…ఫడణవీస్ రాజీనామాను కోరినట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఫడణవీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజీనామను ప్రకటిస్తారని సమాచారం.