లక్ష ద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని లోక్ సభ సచివాలయం రద్దు చేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్దరిస్తున్నట్టు ప్రకటిచింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత మహ్మద్ సలీహ్పై దాడి చేశారని మహ్మద్ ఫైజల్ పై అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో విచారణ జరిపిన కవరట్టి సెషన్స్ కోర్టు ఫైజల్ ను దోషిగా తేల్చింది. ఆయకు పదేండ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు ఈ ఏడాది జనవరి 10న కోర్టు వెల్లడించింది.
జనవరి 13న ఆయనపై లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. అనంతరం కోర్టు తీర్పును కేరళ హైకోర్టులో ఫైజల్ సవాల్ చేశారు. సెషన్స్ కోర్టు తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో ఆయనపై అనర్హత చెల్లుబాటు కాకుండా పోయింది. కానీ లోక్ సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరగాల్సి ఉండగా అంతకుముందే లోక్సభ సచివాలయం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో కేసును కోర్టు కొట్టి వేసింది. రాహుల్ గాంధీ వ్యవహారంపై రచ్చ నడుస్తున్న నేపథ్యంలో ఫైజల్ కేసు ఆసక్తికరంగా మారింది.