ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేకి పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర లోని పూణేలో ఆదివారం జరిగిన ఓ ఈవెంట్ లో ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలంతా తీవ్ర భయాందోళన చెందారు. ఇక్కడి హింజీవాడీ ప్రాంతంలో కరాటే పోటీలను ప్రారంభిస్తున్న సందర్భంగా ..ఛత్రపతి శివాజీ చిత్ర పటానికి ఆమె పూలమాల వేయబోయారు. అయితే అక్కడే టేబుల్ పైనున్న దీపం ఆమె చీరకు అంటుకుంది.
వెంటనే అప్రమత్తమైన ఆమె.. మంటను ఆర్పివేశారు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు కూడా ఆమెకు సహకరించారు. అనంతరం ఆమె ఓ స్టేట్మెంట్ విడుదల చేస్తూ.. ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను సురక్షితంగానే ఉన్నానని తెలిపారు.
తనకెలాంటి గాయాలు కాలేదన్నారు. ఈ ఘటన పట్ల ఆందోళన చెంది.. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన తన శ్రేయోభిలాషులు, పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
ఆమె చీరకు మంటలంటుకున్న వీడియో సర్క్యులేట్ కావడంతో పెద్ద సంఖ్యలో ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను క్షేమంగానే ఉన్నట్టు సుప్రియ సూలే ఆ తరువాత ట్వీట్ కూడా చేశారు.