గడ్డ కట్టించే చలిని లెక్కచేయకుండా దేశ రాజధానిలో 60రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అసలు వారి సమస్యలేంటని ఒక్కసారైనా ప్రధాని మోడీ విచారించారా అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన సాగిస్తున్న రైతులు ఏవైనా పాక్ నుండి వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో సాగుతున్న రైతుల ఆందోళనలకు మద్ధతుగా ముంబై ఆజాద్ మైదాన్ లో సోమవారం జరిగిన రైతు ర్యాలీలో పవార్ సంఘీభావం ప్రకటించారు.
ఆ మూడు కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ఆమోదించే ముందు విపక్షాల అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని పవార్ ఆరోపించారు. ఎలాంటి చర్చ లేకుండానే చట్టాలుగా ఆమోదించారన్నారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దుతగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్రలోని 21 జిల్లాలకు చెందిన రైతులు మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇదే అంశంపై మహారాష్ట్ర గవర్నర్ కు 50వేల మంది రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.