నాడియా ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. మమత వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు.
‘ నాడియా ఘటనలో బాధితురాలిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఒక మహిళగా బాధితురాలి ఆవేదనను మమతా అర్థం చేసుకోవాలి. కానీ బాధితురాలినే ఆమె వేలెత్తి చూపుతున్నారు. అది చాలా తప్పు’ అని ఆమె అన్నారు.
పశ్చిమబెంగాల్ లోని నాడియా జిల్లాలో బాలిక(14)పై తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పంచాయతీ సభ్యుడి కొడుకు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆయనతో పలువురు అత్యాచారం చేసిన తర్వాత తీవ్రంగా గాయపడి ఆ బాలిక మరణించింది. దీంతో బాలిక మరణానికి టీఎంసీ నేత కొడుకే కారణమని బాలిక తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు.
దీనిపై మమతా సోమవారం స్పందిస్తూ… బాలికపై నిజంగా అత్యాచారం జరిగిందా? లేదా ఆమెకు లైంగికదాడి చేసిన వ్యక్తితో లవ్ అఫైర్ ఉందా? దాని వల్లనే గర్భం దాల్చిందా? ఆమె అత్యాచారానికి గురైందని మీకెలా తెలుసంటూ ప్రశ్నలు వేశారు.
ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని మమతా అన్నారు. ఆమెకు అతనితో లవ్ అఫైర్ ఉన్నదని ఆమె కుటుంబ సభ్యులకు సైతం తెలుసన్నారు. ఒక వేళ వాళ్లిద్దరూ సంబంధం పెట్టుకుంటే వాళ్లను మనం ఎలా ఆపగలం? ఇదేమైనా యూపీ అనుకుంటున్నారా అంటూ వ్యాఖ్యలు చేశారు.