భారత రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో వివిధ పార్టీల నేతలు తమ అభ్యర్ధి ఎంపికలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా..ఏన్డీఏ తమ అభ్యర్ధిపై క్లారిటీ ఇచ్చింది. జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ద్రౌపది బుధవారం ఉదయం ఒడిశా రాయ్‌రంగ్‌పూర్ లోని శివాలయానికి వెళ్లారు. అది ఆమె నిత్యం వెళ్లి పూజించి, సేవలు చేసే గుడి. కాగా.. అక్కడ ఆమె మరోసారి తన సింప్లిసిటీని చూపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. చీపురు చేతపట్టి స్వయంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
అయితే.. రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె.. ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇక.. కాబోయే భారత రాష్ట్రపతి కోసం బీజేపీ సంచలనం నిర్ణయం తీసుకుంది. ద్రౌపది ముర్ముకు కేంద్రం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఆమెకు సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి.